జెరూసలెం: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైల్ దాడుల నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. మిసైల్స్‌ను అడ్డుకునే అత్యాధునిక టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) సిస్టమ్‌ను ఇజ్రాయెల్‌కు పంపించింది. ఇది షార్ట్, మీడియం, ఇంటర్ మీడియెట్ బాలిస్టిక్ మిసైల్స్‌ను గాల్లోనే అడ్డుకుని పేల్చి వేస్తుంది. అది కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు వినియోగించకుండానే వాటిని నాశనం చేస్తుంది. గతిశక్తి ద్వారా బలంగా టార్గెట్స్ ను ఢీకొట్టి, వాటిని విచ్ఛిన్నం చేస్తుంది. థాడ్లో నాలుగు ముఖ్యమైన పార్ట్స్ ఉంటాయి. వీటిలో ఫోర్స్ తో మిసైల్స్‌ను నాశనంచేసే ఇంటర్ సెప్టర్ ఒకటి. ఇంకోటి లాంచ్ వెహికల్.. ఇది మొబైల్ ట్రక్. ఇందులో ఇంటర్ సెప్టర్స్ ఉంటాయి. మరొకటి రాడార్.. ఇది 870 నుంచి 3 వేల కిలోమీటర్ల మేర దూరం నుంచి వచ్చే మిసైల్స్‌ను గుర్తిస్తుంది. ఇక చివరగా ఫైర్ కంట్రోల్ సిస్టమ్.. ఇది ఇంటర్ సెప్టర్ల లాంచింగ్, టార్గెటింగ్ ను మానిటర్ చేస్తుంది. ఒక్క థాడ్ బ్యాటరీలో ఆరు లాంచర్స్(ట్రక్కులు) ఉంటాయి. ఒక్కో లాంచర్లో 8 ఇంటర్ సెప్టర్స్ ఉంటాయి. ఒక్కో లాంచర్‌ను రీలోడ్ చేయడానికి 30 నిమిషాలు పడుతుంది. థాడ్ బ్యాటరీని ఆపరేట్ చేయడానికి 95 మంది సైనికులు అవసరం. దీన్ని కేవలం అమెరికా సైనికులు మాత్రమే ఆపరేట్ చేయగలరు. అందుకే ఇజ్రాయెల్ కు థాడ్ బ్యాటరీతో పాటు 100 మంది
సైనికులను కూడా అమెరికా పంపించింది.